🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 04 October 2026, 6:29 pm Posted by : Praja Nestham Jwala News

ముల్కనూర్ సహకార నమూనా స్ఫూర్తిదాయకం

News Image
📌 290 మంది గ్రూప్‌–I, II, III అధికార శిక్షణార్థుల అధ్యయన పర్యటన

రైతు కేంద్రిత సేవలు, ఆధునిక విధానాలపై అధికారుల ప్రశంసలు

హనుమకొండ జిల్లా, ముల్కనూర్, అక్టోబర్‌ 4 (ప్రజానేస్తం జ్వాల): గ్రామీణ ప్రాంతాల్లో సహకార వ్యవస్థ సమర్థవంతమైన నాయకత్వం, సభ్యుల విశ్వాసం, వృత్తిపరమైన నిర్వహణతో ఆర్థిక, సామాజిక మార్పుకు ఎలా దోహదపడుతుందో ముల్కనూర్ సహకార సంఘం ప్రత్యక్షంగా చాటిచెబుతోందని నూతనంగా నియమితులైన ప్రభుత్వ అధికారులు అభిప్రాయపడ్డారు.

డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న తెలంగాణ ప్రభుత్వ నూతన గ్రూప్‌–I, II, III అధికార శిక్షణార్థులు మొత్తం 290 మంది రెండు రోజుల పాటు రెండు విడతలుగా ముల్కనూర్ సహకార గ్రామీణ పరపతి మరియు మార్కెటింగ్ సంఘాన్ని సందర్శించారు. ఒక్కో విడతలో 145 మంది చొప్పున అధికారులు పాల్గొన్నారు.

అధికారిక అధ్యయన పర్యటనలో భాగంగా మొదటి బృందం అక్టోబర్‌ 3న, రెండో బృందం అక్టోబర్‌ 4న ముల్కనూర్ సహకార సంఘాన్ని సందర్శించి సంస్థ కార్యకలాపాలు, వివిధ విభాగాల పనితీరు, రైతులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా పరిశీలించింది.

📌 రైతు కేంద్రిత సేవలపై అవగాహన

ఈ సందర్భంగా సంఘం సిబ్బంది అధికార శిక్షణార్థులకు ముల్కనూర్ సహకార సంఘం ఆవిర్భావం, ప్రస్థానం, రైతులకు అందిస్తున్న రుణాలు, పొదుపు పథకాలు, వ్యవసాయ ఇన్‌పుట్లు, మార్కెటింగ్, ప్రాసెసింగ్, నిల్వ, విలువ ఆధారిత సేవలు, వివిధ వ్యాపార, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్రంగా వివరించారు.

అనంతరం శిక్షణార్థులను సంఘంలోని వివిధ విభాగాలు, సదుపాయాల వద్దకు తీసుకెళ్లి వాటి నిర్వహణ విధానం, సేవల అమలు తీరును ప్రత్యక్షంగా వివరించారు. కార్యక్రమ షెడ్యూల్‌లో భాగంగా ముందుగా అధికారులకు సంస్థ కార్యకలాపాలపై బ్రీఫింగ్ నిర్వహించి, అనంతరం వివిధ విభాగాల సందర్శనకు ప్రత్యేక సమయం కేటాయించారు.

ఈ రెండు రోజుల అధ్యయన పర్యటనను సంఘం జనరల్‌ మేనేజర్‌ ఎం. రామ్‌రెడ్డితో పాటు వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు. శిక్షణార్థులకు అవసరమైన సమాచారం అందిస్తూ వారి సందేహాలను నివృత్తి చేశారు.

📌 ప్రవీణ్‌రెడ్డి నాయకత్వంపై ప్రశంసలు

ముల్కనూర్ సహకార నమూనాను ప్రత్యక్షంగా పరిశీలించిన అధికారులు, దేశంలోని అత్యుత్తమ ప్రాథమిక సహకార సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ముల్కనూర్ సహకార సంఘం నుంచి ప్రత్యక్షంగా నేర్చుకోవడం తమకు గొప్ప అధ్యయన అనుభవంగా నిలిచిందని పేర్కొన్నారు.

గ్రామీణ రైతుల అవసరాలను గుర్తించి సహకార వ్యవస్థను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మార్చుకుంటూ కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడం తమను ఆకట్టుకుందని తెలిపారు.

ముఖ్యంగా సంఘం అధ్యక్షులు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నాయకత్వాన్ని శిక్షణార్థులు ప్రశంసించారు. సంప్రదాయ సహకార కార్యకలాపాలకు పరిమితం కాకుండా ఆధునిక సాంకేతికత, విలువ ఆధారిత సేవలు, కొత్త వ్యాపార కార్యక్రమాలు, రైతు కేంద్రిత వినూత్న పథకాలను ప్రవేశపెట్టి ముల్కనూర్ సహకార సంఘాన్ని ఆధునిక, బహుముఖ సహకార సంస్థగా తీర్చిదిద్దుతున్న విధానం స్ఫూర్తిదాయకంగా ఉందని అభిప్రాయపడ్డారు.

📌 భవిష్యత్‌ పాలనలో ఉపయోగపడే అనుభవం

గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తే రైతుల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు. సభ్యుల విశ్వాసం, పారదర్శక నిర్వహణ, సమర్థ నాయకత్వం, ఆధునిక విధానాల సమన్వయంతో ముల్కనూర్ సహకార సంఘం ప్రత్యేక నమూనాగా నిలుస్తోందన్నారు.

భవిష్యత్తులో ప్రభుత్వ అధికారులుగా విధులు నిర్వర్తించే సమయంలో గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమం, సహకార సంస్థల నిర్వహణ, స్థానిక సంస్థల సమర్థ పాలనకు ముల్కనూర్‌లో పొందిన అనుభవం ఎంతో ఉపయోగపడుతుందని శిక్షణార్థులు తెలిపారు.

రెండు రోజుల అధ్యయన పర్యటనను విజయవంతంగా నిర్వహించిన ముల్కనూర్ సహకార సంఘం అధికారులు, సిబ్బందికి శిక్షణార్థులు అభినందనలు తెలిపారు.
🏠 Home