🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 05 October 2026, 8:29 pm Posted by : Praja Nestham Jwala News

రూ.25 లక్షల కమ్యూనిటీ హాల్‌.. కనీస వసతులు కరువు!

News Image
📌 ప్రహరీ, విద్యుత్‌, నీటి సౌకర్యాలు లేక నిరుపయోగంగా భవనం


అధికారులు స్పందించి వినియోగంలోకి తీసుకురావాలని కాలనీవాసుల విజ్ఞప్తి


ఆత్మకూర్ (ఎస్), అక్టోబర్ 5 | ప్రజానేస్తం జ్వాల | సూర్యాపేట జిల్లా బ్యూరో:
ప్రజల సౌకర్యార్థం లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ వినియోగానికి నోచుకోకుండా నిరుపయోగంగా మారింది. ఆత్మకూర్ (ఎస్) మండలంలోని ఏపూర్ గ్రామం ఎస్సీ పడమటి గూడెం కాలనీలో 2017లో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌కు సుమారు రూ.25 లక్షలు వెచ్చించినప్పటికీ ప్రస్తుతం కనీస మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలకు అందుబాటులో లేకుండా పోయిందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పేద, మధ్యతరగతి కుటుంబాలు వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నిర్మించిన ఈ భవనం ప్రస్తుతం నిర్వహణ లోపంతో వెలవెలబోతోందని స్థానికులు పేర్కొంటున్నారు.

ప్రహరీ లేక అధ్వానంగా పరిసరాలు

కమ్యూనిటీ హాల్‌ చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడంతో భవనానికి రక్షణ లేకుండా పోయిందని స్థానికులు చెబుతున్నారు. హాల్‌ పరిసరాల్లో పిచ్చిమొక్కలు, చెట్లు, చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్రంగా మారాయని తెలిపారు. దీంతో భవనం పరిసరాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మౌలిక వసతులు కల్పించాలి

హాల్‌కు ప్రహరీ గోడ, విద్యుత్‌, నీటి సౌకర్యాలు కల్పించడంతో పాటు తలుపులు, కిటికీలు, అవసరమైన మరమ్మతులు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు. అదేవిధంగా పరిసరాలను శుభ్రం చేసి అవసరమైన చోట రేకుల షెడ్డు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి

కమ్యూనిటీ హాల్‌ పరిస్థితిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన అంచనాలు రూపొందించి నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పరిసరాలను శుభ్రం చేయడంతో పాటు భవనానికి అవసరమైన మరమ్మతులు చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

“ప్రజాధనంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ నిరుపయోగంగా ఉండటం బాధాకరం. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఈ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు వెంటనే స్పందించి అన్ని మౌలిక వసతులు కల్పించి వినియోగంలోకి తీసుకురావాలి” అని ఎస్సీ పడమటి గూడెం కాలనీవాసులు కోరుతున్నారు.
🏠 Home