ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలి
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి.. పోలీసు సిబ్బందికి వరంగల్ సీపీ ఎన్. శ్వేతా సూచన
భీమదేవరపల్లి, అక్టోబర్ 9 (ప్రజానేస్తం జ్వాల):ప్రజలకు మర్యాదపూర్వకంగా సేవలందిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేతా, ఐపీఎస్ పోలీసు సిబ్బందికి సూచించారు.వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం ఆమె ముల్కనూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత పూల మొక్కను అందజేసి సీపీకి స్వాగతం పలికారు. అనంతరం ముల్కనూర్ ఎస్‌ఐ ఎం. రాజు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సీపీకి గౌరవ వందనం సమర్పించారు.తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, స్టేషన్ పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా సీపీ ఎన్. శ్వేతా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చిన్నచిన్న సమస్యల పరిష్కారం కోసం సైతం పోలీసులను ఆశ్రయిస్తారని తెలిపారు. అలాంటి సమయంలో ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను అర్థం చేసుకుని సత్వర న్యాయం అందించాలని సూచించారు. ప్రజల నమ్మకాన్ని పొందేలా విధులు నిర్వహించాలని, ప్రజలకు సేవ చేయడం పోలీసులకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ప్రజాసేవే పోలీసుల ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ మామిడి మొక్కను నాటారు.
ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్‌రెడ్డి, ఎల్కతుర్తి సీఐ కె. శ్రీను, ముల్కనూర్ ఎస్‌ఐ ఎం. రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.