తృటిలో తప్పిన పెను ప్రమాదం.. పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడిన కారు
భీమదేవరపల్లి, అక్టోబర్ 10 (ప్రజా నేస్తం జ్వాల): ఎదురుగా వస్తున్న మోటార్‌సైకిల్‌ను తప్పించబోయిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు, వారి ఇద్దరు పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన గట్ల నర్సింగాపూర్ స్టేజ్ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అనిల్ కుమార్ తన భార్య అన్నపూర్ణ, ఇద్దరు పిల్లలతో కలిసి హుస్నాబాద్ వైపు నుంచి కారులో వస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ చదువుతున్న తమ కుమార్తెను తీసుకొని స్వగ్రామమైన హుజురాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గట్ల నర్సింగాపూర్ స్టేజ్ వద్ద ఎదురుగా మోటార్‌సైకిల్ రావడంతో దానిని తప్పించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కొద్దిసేపు ఆందోళన నెలకొంది.