🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 October 2026, 9:19 pm Posted by : Praja Nestham Jwala News

ఓరుగల్లులో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

News Image
హనుమకొండ (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు చారిత్రక ఓరుగల్లు నగరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. వరంగల్‌, హనుమకొండ నగరాల్లో ఎటుచూసినా రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలు, సంప్రదాయ వస్త్రధారణలో ఆడపడుచుల సందడితో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు. హనుమకొండలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు, నగర ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన మహిళలు గుమ్మడి, తంగేడు, గులాబీ, చామంతి తదితర పూలతో అందంగా బతుకమ్మలను పేర్చారు. వాటిని గౌరమ్మగా భావించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ లయబద్ధంగా ఆడిపాడారు. రంగురంగుల పూల బతుకమ్మలు, మహిళల కోలాహలంతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ భావితరాలకు అందించడంలో బతుకమ్మ పండుగ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. పండుగ సందర్భంగా నగరంలోని ప్రధాన కూడళ్లు, దేవాలయాల వద్ద మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యుత్‌ దీపాలంకరణ, పారిశుధ్యం, భద్రతా చర్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వివరించారు. మహిళలు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, నగర ప్రముఖులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓరుగల్లు నగరమంతా బతుకమ్మ పాటలు, పూల సోయగాలతో పండుగ సందడి నెలకొంది.
🏠 Home