🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 10 October 2026, 9:24 pm Posted by : Praja Nestham Jwala News

మా డిమాండ్ నెరవేరే వరకు పోరాటం ఆగదు

News Image
వరంగల్ (ప్రజానేస్తం జ్వాల): తమ డిమాండ్లు నెరవేరే వరకు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటాన్ని కొనసాగిస్తామని సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (CJP) తెలంగాణ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన శాంతియుత నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ సమీపంలో పోలీసులు తమను నిర్బంధించారని ఆరోపించారు. శనివారం వరంగల్‌కు చేరుకున్న వారు మీడియా సమావేశంలో తమకు ఎదురైన అనుభవాలను వెల్లడించారు. CJP ప్రతినిధులు స్టాన్లీ కొరాని, రంగా సాయి రెడ్డి, రాజేష్ కొరపాక, వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ భోపాల్ సమీపంలో పోలీసులు తమను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధంలో ఉన్నప్పటికీ తమ నిరసనను కొనసాగిస్తూ 24 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టినట్లు తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని వారు అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణలో విఫలమయ్యారంటూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని CJP ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ నెరవేరే వరకు రాజ్యాంగబద్ధమైన, శాంతియుత మార్గాల్లో నిరసనలు కొనసాగిస్తామని ప్రకటించారు. నిర్బంధాలు, అరెస్టులతో తమ ఉద్యమాన్ని అణచివేయలేరని స్పష్టం చేశారు. CJP వాలంటీర్లకు సంఘీభావం
వరంగల్‌కు చేరుకున్న CJP తెలంగాణ ప్రతినిధులకు హనుమకొండ, వరంగల్ ప్రాంతాలకు చెందిన స్థానిక వాలంటీర్లు, వివిధ ప్రజాసంఘాల నాయకులు స్వాగతం పలికారు. వారి ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం శాంతియుత పోరాటాలు కొనసాగిస్తామని CJP ప్రతినిధులు తెలిపారు.
🏠 Home