🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 12 October 2026, 8:13 am Posted by : Praja Nestham Jwala News

వరంగల్ విమానాశ్రయానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలి

News Image
జై గౌడ్ ఉద్యమం రాష్ట్రవ్యాప్త పోస్టర్ ప్రచార యాత్రకు శ్రీకారం

మహబూబ్‌నగర్‌లో పోస్టర్ ఆవిష్కరించిన మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్

మహబూబ్‌నగర్, అక్టోబర్ 11 (ప్రజానేస్తం జ్వాల): వరంగల్ విమానాశ్రయానికి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ జై గౌడ్ ఉద్యమం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్ ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టింది. ఉద్యమ రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

పాపన్న గౌడ్ చరిత్రకు గుర్తింపు ఇవ్వాలి
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ప్రజల హక్కుల కోసం పోరాడిన చారిత్రక నాయకుడని గుండ్రాతి నారాయణ గౌడ్ పేర్కొన్నారు. సుమారు 300 ఏళ్ల క్రితం సామాజిక అసమానతలు, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి తనదైన పాలనా ప్రస్థానాన్ని నిర్మించుకున్న పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.పాపన్న గౌడ్‌తో అనుబంధమున్న కోటలు, ఆయన పోరాట ప్రస్థానం తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. అలాంటి చారిత్రక వ్యక్తి పేరును వరంగల్ విమానాశ్రయానికి పెట్టడం ద్వారా ఆయన సేవలకు తగిన గుర్తింపు లభిస్తుందని ఉద్యమ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్ ప్రచార యాత్ర
వరంగల్ విమానాశ్రయానికి పాపన్న గౌడ్ పేరు పెట్టాలనే డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్ ప్రచార యాత్ర నిర్వహించనున్నట్లు జై గౌడ్ ఉద్యమం ప్రకటించింది. ఈ ఉద్యమానికి గౌడ సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని గుండ్రాతి నారాయణ గౌడ్ విజ్ఞప్తి చేశారు.పాపన్న గౌడ్ చరిత్ర, పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని ప్రజలకు వివరించడంతో పాటు విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టే అంశంపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ డిమాండ్ సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.
🏠 Home