యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
పరకాల, అక్టోబర్ 14 (ప్రజానేస్తం జ్వాల): పరకాల పట్టణంలోని రాజుపేటలో నూతనంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి గారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడమే కాకుండా, వాటిని పూర్తి చేసి ప్రారంభోత్సవాలు కూడా తామే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విద్యారంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి వస్తే స్థానిక విద్యార్థులకు ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్మాణ పనులను ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చేపట్టాలని, నాణ్యత విషయంలో రాజీ పడకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. విద్యారంగ అభివృద్ధి ద్వారా భవిష్యత్ తరాలకు మెరుగైన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.