🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 14 October 2026, 7:57 pm Posted by : Praja Nestham Jwala News

ట్రాన్స్‌ఫార్మర్‌పై మరమ్మతులు.. విద్యుత్ షాక్‌తో రైతు మృతి

News Image
మెదక్, ప్రజానేస్తం జ్వాల:మెదక్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌పై మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై రైతు మృతి చెందాడు. ఈ ఘటన టేక్మాల్ మండలం దండువానికుంట తండాలో చోటుచేసుకుంది. మృతుడు విస్లావత్ అనిల్‌గా గుర్తించారు.అందిన సమాచారం ప్రకారం.. ట్రాన్స్‌ఫార్మర్‌పై మరమ్మతులు చేసే సమయంలో రైతు అనిల్ విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాలు కోల్పోయాడు. విద్యుత్ సిబ్బంది సమక్షంలోనే రైతు ట్రాన్స్‌ఫార్మర్‌పై పని చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. లైన్‌మెన్ దగ్గరుండి రైతుతో మరమ్మతులు చేయించాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
విద్యుత్ సిబ్బందిపై కుటుంబ సభ్యుల ఆగ్రహం
రైతు మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లైన్‌మెన్‌పై దాడి చేసినట్లు సమాచారం. ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. విద్యుత్ సరఫరాను పూర్తిగా నిలిపివేసి, అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.రైతు మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నట్లు సమాచారం.
🏠 Home