🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 5:01 am Posted by : Praja Nestham Jwala News

వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి.

News Image
భీమదేవరపల్లి, అక్టోబర్ 14 (ప్రజా నేస్తం జ్వాల):మెదక్ పట్టణంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. మహనీయుల విగ్రహాలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం డిమాండ్ చేసింది.ఈ సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ మాట్లాడుతూ.. భూమి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. మంగళవారం తెల్లవారుజామున మెదక్ పట్టణంలోని వెల్కమ్ బోర్డు సమీపంలో, చేగుంట–హైదరాబాద్, నర్సాపూర్–హైదరాబాద్ ప్రధాన రహదారుల కూడలి వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి కాళ్లు, మెడ విరగ్గొట్టడం తీవ్ర ఆందోళన కలిగించే ఘటన అని పేర్కొన్నారు.
“విగ్రహాన్ని ధ్వంసం చేయగలరు.. కానీ ఐలమ్మ పోరాట స్ఫూర్తిని, చరిత్రను ధ్వంసం చేయలేరు” అని ప్రకాష్ స్పష్టం చేశారు. భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి, సామాజిక న్యాయ పోరాటానికి ప్రతీకగా నిలిచారని తెలిపారు.
ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర దర్యాప్తు చేపట్టి, విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని చెప్యాల ప్రకాష్ డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించి, సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితులను త్వరితగతిన అరెస్టు చేయాలని కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, ముఖ్యమైన కూడళ్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు, తగిన భద్రతా చర్యలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
“మహనీయుల విగ్రహాలు కేవలం రాతి ప్రతిమలు కావు. అవి సమాజ మార్పు కోసం సాగిన పోరాటాలకు సజీవ గుర్తులు. వాటిని ధ్వంసం చేయడం అంటే సమానత్వం, సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కోసం పోరాడిన చరిత్రను అవమానించడమే” అని ప్రకాష్ అన్నారు.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, మహనీయుల విగ్రహాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తొందూరి ఎల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి కండే సుధాకర్, భీమదేవరపల్లి మండల రాజ్యాంగ పరిరక్షణ చైతన్య వేదిక మండల అధ్యక్షులు ఉప్పుల కుమారస్వామి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాక రమేష్, బీసీ ఉద్యమ నాయకులు, అక్కన్నపేట జేఏసీ ఇన్‌చార్జి వేముల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home