🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 October 2026, 4:44 pm Posted by : Praja Nestham Jwala News

నేరేడుచర్ల మార్కెట్‌ కమిటీ పగ్గాలు రంగినేని స్పందన రాజీవ్‌కు

News Image
నేరేడుచర్ల, అక్టోబర్ 15 (ప్రజానేస్తం జ్వాల): నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం కొలువుదీరింది. నేరేడుచర్ల, పాలకవీడు మండలాల పరిధిలోని రైతులకు సంబంధించిన మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన రాజీవ్‌, వైస్‌ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. మార్కెట్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం కాంగ్రెస్‌ శ్రేణుల సందడి, నాయకులు, కార్యకర్తల హాజరుతో ఉత్సాహభరితంగా సాగింది.
చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్మన్‌తో పాటు 17 మంది సభ్యులతో కూడిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ కొణతం చిన్న వెంకట్‌రెడ్డి అధ్యక్షత వహించారు. రెండు మండలాలకు చెందిన కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, సర్పంచులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో మార్కెట్‌ కార్యాలయం వద్ద సందడి నెలకొంది.
ఘన సన్మానం.. కార్యకర్తల్లో ఉత్సాహం
ప్రమాణ స్వీకారం అనంతరం నూతన చైర్‌పర్సన్‌ రంగినేని స్పందన రాజీవ్‌ను నాయకులు, కార్యకర్తలు పూల బొకేలు అందించి సత్కరించారు. రాజీవ్‌ యూత్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించి గజమాలతో ఘనంగా అభినందించారు. నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
రైతుల అభివృద్ధిపై ఆశలు
నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో నేరేడుచర్ల, పాలకవీడు మండలాల రైతుల్లో మార్కెట్‌ కమిటీ సేవలపై ఆశలు నెలకొన్నాయి. రైతులకు మార్కెట్‌ యార్డులో మెరుగైన సౌకర్యాలు, వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాల్లో అనుకూల వాతావరణం, రైతుల సమస్యల పరిష్కారానికి పాలకవర్గం ప్రాధాన్యం ఇవ్వాలని స్థానికులు ఆశిస్తున్నారు.
🏠 Home