విద్యార్థినికి వేధింపులు.. పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
గరిడెపల్లి, నవంబర్ 4 (ప్రజానేస్తం జ్వాల): విద్యార్థుల భద్రతకు బాధ్యత వహించాల్సిన పాఠశాల యాజమాన్యమే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అని ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకుడు, మాజీ ఎంపీటీసీ చింతిరాల నాగయ్య ప్రశ్నించారు. పట్టణంలోని కాకతీయ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థినికి సంబంధించిన ఘటనపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థినితో మాట్లాడేందుకు ఉపాధ్యాయులు ప్రోత్సహించి, అనంతరం ఆమెను భయభ్రాంతులకు గురిచేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. గతంలోనూ పాఠశాలలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయని, ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు తమ సమస్యలను బయటపెట్టలేక టీసీలు తీసుకొని వెళ్లిపోయిన సందర్భాలున్నాయని ఆరోపించారు. తాజాగా జరిగిన ఘటన బయటకు రాకుండా విద్యార్థినికి టీసీ ఇచ్చి పంపిస్తామని చెప్పి భయపెట్టినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై విద్యాశాఖ, పోలీసు అధికారులు తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని నాగయ్య డిమాండ్ చేశారు. పాఠశాల యాజమాన్యంతో పాటు కాకి శ్రీధర్ గౌడ్ పాత్రపైనా విచారణ జరిపి, ఈ వ్యవహారంలో ప్రోత్సహించిన, సహకరించిన వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యార్థినికి న్యాయం చేయడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.