🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 25 November 2026, 7:10 pm Posted by : Praja Nestham Jwala News

గోల్డ్ లోన్ వినియోగదారులకు మార్జిన్ షార్ట్‌ఫాల్ చెల్లింపులకు గడువు ఇవ్వాలి

News Image
తాకట్టు బంగారం వేలం విషయంలో ఆరు నెలల వెసులుబాటు కల్పించాలి: కక్కిరేణి శ్రీనివాస్

సూర్యాపేట, నవంబర్ 25 (ప్రజానేస్తం జ్వాల): బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న సామాన్య, మధ్యతరగతి వినియోగదారులకు మార్జిన్ షార్ట్‌ఫాల్ చెల్లింపుల విషయంలో తగిన గడువు కల్పించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ కోశాధికారి కక్కిరేణి శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బంగారం ధరల్లో చోటుచేసుకుంటున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో గోల్డ్ లోన్ వినియోగదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, వ్యాపార అవసరాల కోసం చాలామంది తమ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తీసుకుంటారని తెలిపారు. బంగారం ధరల్లో మార్పుల కారణంగా మార్జిన్ షార్ట్‌ఫాల్ ఏర్పడినప్పుడు అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితి వినియోగదారులకు ఆర్థిక ఇబ్బందులు కలిగించే అవకాశం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో రుణగ్రహీతలకు తమ ఖాతాలను క్రమబద్ధీకరించుకునేందుకు తగిన సమయం కల్పించాలని కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అంశాన్ని పరిశీలించి బ్యాంకులు, ప్రైవేటు ఆర్థిక సంస్థలకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్జిన్ షార్ట్‌ఫాల్ చెల్లింపులకు కనీసం ఆరు నెలల గడువు కల్పించాలని, ఆ వ్యవధిలో తాకట్టు బంగారు ఆభరణాల వేలం ప్రక్రియను నిలిపివేసే వెసులుబాటు కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వినియోగదారులకు ముందస్తు సమాచారం, తగిన నోటీసులు అందించి, రుణ ఖాతాలను సరిచేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు.

గోల్డ్ లోన్ వినియోగదారుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు, ప్రైవేటు ఆర్థిక సంస్థలు రుణ చెల్లింపుల విషయంలో తగిన వెసులుబాటు కల్పించాలని అన్నారు. బంగారు ఆభరణాలు సామాన్య కుటుంబాల ఆర్థిక భద్రతలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్న నేపథ్యంలో గోల్డ్ లోన్ వినియోగదారులకు ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ తగిన విధానపరమైన చర్యలు తీసుకోవాలని కక్కిరేణి శ్రీనివాస్ కోరారు.
🏠 Home