🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 26 November 2026, 10:21 pm Posted by : Kommanaboina Yakaiah

రైతులకు భరోసా ఏది.. బోనస్ ఎక్కడ.....? పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర లేక.. దళారులకే ధాన్యం అమ్ముకునే దుస్థితి... రెండు పంటల బోనస్‌ కోసం ఎదురుచూస్తున్న రైతులు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు..

News Image
తొర్రూరు మహబూబాబాద్ జిల్లా నవంబర్ 26 (ప్రజానేస్తం జ్వాల జిల్లా ప్రతినిధి): ...//
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా లభించకపోవడంతో దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని... రైతుల సంక్షేమమే లక్ష్యమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు. గురువారం తొర్రూరు పట్టణంలోని అన్నారం రోడ్డులో భద్రకాళి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనను ఆయనకు వివరించారు. సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో తాము పండించిన ధాన్యాన్ని ఇప్పటికే దళారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వచ్చిందని వాపోయారు. ప్రభుత్వం ప్రకటించిన బోనస్ వస్తుందన్న ఆశతో రోజుల తరబడి ఎదురుచూసినా ప్రయోజనం లేకుండా పోయిందని, దాదాపు రెండు పంటలకు సంబంధించిన బోనస్ ఇప్పటికీ తమ ఖాతాల్లో జమ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం, బోనస్ చెల్లింపుల్లో నిర్లక్ష్యం కారణంగా తీవ్రంగా నష్టపోయామని రైతులు మాజీ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు రైతులకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించి, ఆ హామీని సకాలంలో అమలు చేయక పోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో కొనుగోలు చేయాల్సి ఉండగా, కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేయడం వల్ల రైతులు దళారుల చేతుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర పొందాల్సిన రైతులు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవడం బాధాకరమని పేర్కొన్నారు.
రైతు భరోసా పథకం అమలులోనూ రైతులకు ఎదురుచూపులే మిగులుతున్నాయని, రైతు రుణమాఫీ విషయంలోనూ అనేక మంది రైతులకు పూర్తిస్థాయిలో ప్రయోజనం అందలేదని ఆరోపించారు. రైతులకు పెట్టుబడి సాయం, పంటకు గిట్టుబాటు ధర, బోనస్, రుణమాఫీ వంటి హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో ఎదురవుతున్న సమస్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తుచేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పంట పండిస్తే చివరకు పంటను అమ్ముకునేందుకు కూడా ఇబ్బందులు పడాల్సి రావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, పెండింగ్‌లో ఉన్న బోనస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, రైతు భరోసా, రుణమాఫీ పథకాల ప్రయోజనాలను అర్హులైన రైతులందరికీ అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకొని రైతులకు మద్దతు ధర అందేలా చూడాలని డిమాండ్ చేశారు.
🏠 Home