🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 7:29 pm Posted by : Praja Nestham Jwala News

ఆరో రోజుకు చేరిన రాంకీ డంపింగ్ యార్డు వ్యతిరేక రిలే దీక్షలు

News Image
డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలి.. పాలకులు స్పందించకుంటే ఎన్నికల్లో తగిన మూల్యం తప్పదు: ప్రజా సంఘాల నేతల హెచ్చరిక

జవహర్‌నగర్, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): రాంకీ చెత్త డంపింగ్ యార్డు తొలగింపు డిమాండ్‌తో చేపట్టిన ప్రజా ఉద్యమం రోజురోజుకూ ఉధృతమవుతోంది. డంపింగ్ యార్డు కారణంగా పరిసర ప్రాంతాల ప్రజల ఆరోగ్యం, పర్యావరణానికి ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో ఆరో రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని సందర్శించిన వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు డంపింగ్ యార్డును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకవర్గాలను హెచ్చరించారు.

గత ఆరు నెలలుగా ఈ ప్రాంతంలోని విప్లవ, వామపక్ష, అఖిలపక్ష, దళిత, మహిళా సంఘాలు ఏకమై జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీగా ఏర్పడి ఉద్యమాన్ని కొనసాగిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజల జీవనంపై ప్రభావం చూపుతోందని కమిటీ నాయకులు పేర్కొంటూ, రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును, పర్యావరణ పరిరక్షణను కాపాడేందుకు డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ సమస్య పరిష్కారం కోసం పోరాట కమిటీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాభవన్, జిల్లా కలెక్టర్ కార్యాలయం, హెచ్‌ఎండీఏ కార్యాలయాల్లో వినతిపత్రాలు సమర్పించారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ఎమ్మెల్యేలకు కూడా తమ డిమాండ్లను తెలియజేశారు. అంతేకాకుండా డంపింగ్ యార్డు పరిసర బస్తీల్లో పాదయాత్రలు నిర్వహించి, ధర్నాలు, నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు.

అయితే తమ విజ్ఞప్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆశించిన స్పందన రాలేదని పోరాట కమిటీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో నిరసనను మరింత ఉధృతం చేస్తూ చెన్నాపూర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించినట్లు తెలిపారు.

ఆరో రోజు దీక్షకు సంఘీభావం తెలిపిన వివిధ పార్టీల, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు సమస్యను పాలకులు ఇకనైనా తీవ్రంగా పరిగణించాలని కోరారు. ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని, పరిస్థితి మరింత తీవ్రం కాకముందే డంపింగ్ యార్డును తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో పాలక పార్టీలకు ప్రజల నుంచి రాజకీయంగా ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని వారు హెచ్చరించారు.

సీపీఎం వెంకన్న, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ ప్రతినిధులు, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ఉయ్యాల ఉమ, బీఎస్పీ బిర్రు యాకస్వామి, ఏఐఎఫ్‌టీయూ వై. మల్లేష్, బి. వెంకటేశ్వర్లు, బహుజన సత్తా బండకింది సింగరయ్య గౌడ్, టీయూ జేఏసీ బి. రాజు, రాణి, డి. లలిత, కె. నర్సన్న, కనకం ఆంజనేయులు, సుజ్జి తదితరులు పాల్గొన్నారు.

సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గడ్డం సదానందం, పీఓడబ్ల్యూ డి. స్వరూప, ఐఎఫ్‌టీయూ పి. శివబాబు, పీఓడబ్ల్యూ వి. జయసుధ, ఏఐఎఫ్‌టీయూ వై. మల్లేష్, జర్నలిస్ట్ కొన్నే వేణు, సీపీఐ దర్శనం యాదగిరి, న్యూ డెమోక్రసీ సురేందర్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ కల్లెపు చంద్రన్న ప్రసాద్, టీవీవీయూ ఏ. కవిత తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
🏠 Home