🏠 www.prajanesthamjwalanews.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 November 2026, 7:42 pm Posted by : Praja Nestham Jwala News

రాజంపేట గ్రామపంచాయతీలో డిప్యూటీ కమిషనర్ సుధాకర్ పర్యటన

News Image
అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణపై క్షేత్రస్థాయి పరిశీలన.. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించాలని సూచన

రాజంపేట, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): పంచాయతీరాజ్ కమిషనర్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి దివ్య దేవరాజన్ ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ సుధాకర్ శుక్రవారం రాజంపేట గ్రామపంచాయతీలో పర్యటించి వివిధ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రాజంపేటలోని జూబ్లీ మార్కెట్‌ను సందర్శించి చికెన్, మటన్, చేపల మార్కెట్ల నిర్వహణను తనిఖీ చేశారు. మార్కెట్ పరిసరాల్లో పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఇంకుడు గుంతలను పరిశీలించారు.

గ్రామంలోని ప్రధాన రహదారి మధ్య విభాజకాలను, గ్రామపంచాయతీ పరిధిలోని వివిధ ప్రాంతాలను గాలినడకన సందర్శించి పారిశుధ్య నిర్వహణను తనిఖీ చేశారు. గ్రామంలో చేపట్టిన వీబీజీ రామ్‌జీ పథకం పనుల పురోగతిని కూడా పరిశీలించారు. ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేయడం ద్వారా భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.

ఈ పర్యటనలో రాజంపేట సర్పంచ్ బుర్సా పోచయ్య, జిల్లా పంచాయతీ కార్యాలయ సమన్వయ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్, డివిజనల్ పంచాయతీ అధికారి ఉమర్ హుస్సేన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మండల పంచాయతీ అధికారి మౌనిక, వార్డు సభ్యుల జిల్లా అధ్యక్షుడు గులాం జావిద్, కొమరం వేణు, జబరి కిషోర్, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, జూనియర్ అసిస్టెంట్ సంతోష్, బిల్ కలెక్టర్ నాగేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home