Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

Author
Posted By Praja Nestham Jwala News
| 27 Nov 2026, 06:52 PM |
వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

సూర్యాపేట, నవంబర్ 27 (ప్రజానేస్తం జ్వాల): వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయనాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం సూర్యాపేటలోని సీపీఐ కార్యాలయంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్లాది మంది వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతాంగ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.

పోరాడి సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు తగిన బడ్జెట్ కేటాయింపులు చేయడం లేదని ఆరోపించారు. పథకం పేరును మార్చి, కొత్త విధానాల ద్వారా కుల, మతాల పేరుతో ప్రజలను విభజించే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ 44 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్‌లుగా మార్చి కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తున్నారని విమర్శించారు. రైతుల ఆందోళనల నేపథ్యంలో రద్దు చేస్తామని ప్రకటించిన మూడు వ్యవసాయ చట్టాలను పరోక్షంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని, సంవత్సరానికి 200 రోజుల పని కల్పించి రోజువారీ కూలీని రూ.700కు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లోనూ ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు.

కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రేషన్ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేసి వ్యవసాయ కార్మిక కుటుంబాలకు ఏటా రూ.12 వేల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. మహిళలకు చేయూత పథకం కింద నెలకు రూ.4 వేల పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నీలం నాగభద్రం, సహాయ కార్యదర్శి రావుల సత్యం, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను, వెలిది పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి