Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కాన్షిరామ్ ఆశయ సాధనే లక్ష్యం.. బహుజన రాజ్యాధికారమే ధ్యేయం!

Author
Posted By Praja Nestham Jwala News
| 09 Oct 2026, 10:41 PM |
కాన్షిరామ్ ఆశయ సాధనే లక్ష్యం.. బహుజన రాజ్యాధికారమే ధ్యేయం!

కొత్తకొండ, అక్టోబర్ 9 (ప్రజా నేస్తం జ్వాల):

బహుజనుల ఐక్యతే బలం.. రాజకీయ అధికారమే లక్ష్యం.. కాన్షిరామ్ ఆశయాల సాధనే మనందరి కర్తవ్యం అని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ పిలుపునిచ్చారు. బహుజన సిద్ధాంతకర్త, సామాజిక న్యాయ సాధకుడు, బహుజన ఉద్యమ మార్గదర్శి మాన్యవర్ కాన్షిరామ్ ఆశయాలను కొనసాగిస్తూ బహుజన రాజ్యాధికార సాధన కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని ఆయన అన్నారు. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మాన్యవర్ కాన్షిరామ్ వర్ధంతి కార్యక్రమంలో ప్రకాష్ పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెప్యాల ప్రకాష్ మాట్లాడుతూ.. “ఓట్లు మావి.. సీట్లు మీవా?” అనే నినాదంతో బహుజన వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించి, అణగారిన వర్గాలను ఐక్య ఉద్యమం వైపు నడిపించిన గొప్ప నాయకుడు కాన్షిరామ్ అని కొనియాడారు. బహుజనులు కేవలం ఓటు బ్యాంకుగా మిగిలిపోకుండా, తమ ఓట్ల బలంతోనే రాజకీయ అధికారాన్ని సాధించి పాలనలో భాగస్వాములు కావాలన్నదే ఆయన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

కాన్షిరామ్ తన జీవితాన్ని బహుజనుల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కోసం అంకితం చేశారని తెలిపారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో బహుజన రాజకీయ శక్తిని సంఘటితం చేసి, అధికార సాధన దిశగా ఉద్యమాన్ని బలోపేతం చేసిన ఆయన పోరాటం దేశవ్యాప్తంగా బహుజనులకు స్ఫూర్తిదాయకమని అన్నారు. కాన్షిరామ్ ఆశయాలు కేవలం వర్ధంతి సభలకే పరిమితం కాకూడదని, ఆయన చూపిన మార్గంలో బహుజన సమాజం ఐక్యంగా ముందుకు సాగాలని ప్రకాష్ పిలుపునిచ్చారు. బహుజన మేధావులు, యువత, సామాజిక ఉద్యమకారులు ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి, సమానత్వం, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం కృషి చేయాలని కోరారు. “బహుజనులారా.. బహుజన మేధావులారా.. ఏకం కండి! కాన్షిరామ్ ఆశయాలను ఆచరణలో పెట్టండి! ఐక్యతతో ముందుకు సాగి బహుజన రాజ్యాధికారాన్ని సాధించండి!” అని ఆయన పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి కండే సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తందూరి ఎల్లయ్య, రాజ్యాంగ పరిరక్షణ కమిటీ భీమదేవరపల్లి మండల అధ్యక్షుడు ఉప్పుల కుమారస్వామి, కట్కూరు సర్పంచ్ బాలరాజు, కోడముంజ బాలరాజు, బహుజన ఉద్యమ నాయకురాలు ములుగురి సునీత, మాజీ ఎంపీటీసీ మేక రమేష్, వేముల జగదీష్ తదితరులు పాల్గొన్నారు.