Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కేసీఆర్‌పై అవమానకర చర్యలు కాంగ్రెస్‌ పతనానికి నాంది: చల్లా ధర్మారెడ్డి పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ

Author
Posted By Praja Nestham Jwala News
| 10 Oct 2026, 09:04 PM |
కేసీఆర్‌పై అవమానకర చర్యలు కాంగ్రెస్‌ పతనానికి నాంది: చల్లా ధర్మారెడ్డి పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ

హనుమకొండ (ప్రజానేస్తం జ్వాల): తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అవమానించే చర్యలు కాంగ్రెస్‌ పార్టీ పతనానికి నాంది పలుకుతాయని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. తెలంగాణ సాధన కోసం పోరాడి, రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేసిన నాయకుడిని కించపరిచేలా వ్యవహరించడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. తెలంగాణ జిల్లాల ఏర్పాటు దశాబ్ది సందర్భంగా శనివారం హనుమకొండలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని చల్లా ధర్మారెడ్డి పేర్కొన్నారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం, 33 జిల్లాల ఏర్పాటు, జిల్లా కలెక్టరేట్ల నిర్మాణం ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేశారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా వంటి కార్యక్రమాలు రైతులకు భరోసా కల్పించాయని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటి రంగానికి ప్రాధాన్యమిచ్చామని పేర్కొన్నారు. కేసీఆర్‌ పాలనకు, ప్రస్తుత కాంగ్రెస్‌ పాలనకు ఎంతో తేడా ఉందని వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పరకాల అభివృద్ధికి ప్రత్యేక కృషి
కేసీఆర్‌, కేటీఆర్‌ల సహకారంతో పరకాల నియోజకవర్గాన్ని వివిధ రంగాల్లో అభివృద్ధి చేశామని చల్లా ధర్మారెడ్డి తెలిపారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన పరకాల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం, దామెర, నడికుడ మండలాల ఏర్పాటు వంటి కార్యక్రమాలను వివరించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ద్వారా మహిళలు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. హనుమకొండలో 1000 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంతో పాటు విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యమిచ్చినట్లు పేర్కొన్నారు. కేసీఆర్‌ దిష్టిబొమ్మలను దహనం చేయడం, రంపాలతో కోసే విధంగా ప్రదర్శనలు నిర్వహించడం వంటి చర్యలు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నాయకుడిని అవమానించడం ద్వారా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేరని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే నాయకులకు ప్రజాక్షేత్రంలో ప్రజలే తగిన సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌, మాజీ ఎమ్మెల్యేలు అరూరి రమేష్‌, తాటికొండ రాజయ్య, మాజీ కుడా చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి తదితర నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.