Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఆదివాసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు!

Author
Posted By Praja Nestham Jwala News
| 15 Oct 2026, 10:15 PM |
ఆదివాసీల హక్కులను కాలరాస్తే సహించేది లేదు!

సిర్పూర్ (యు), అక్టోబర్‌ 15 (ప్రజానేస్తం జ్వాల): ఆదివాసీల హక్కులకు భంగం కలిగిస్తూ, గ్రామాల్లో మౌలిక వసతుల నిర్మాణాలను అడ్డుకుంటే సహించేది లేదని ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) అటవీ శాఖ అధికారులను హెచ్చరించింది. సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆటంకాలు కల్పిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆదివాసీలు గురువారం సిర్పూర్ (యు) మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని ముట్టడించి భారీ ధర్నా నిర్వహించారు. చట్టబద్ధమైన హక్కులను పరిరక్షించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సమితి జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మండల కేంద్రంలోని కొమురం భీం, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహాల వద్ద నుంచి సాంప్రదాయ డోల్ వాయిద్యాలు, నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు తరలిరావడంతో ఆ ప్రాంతంలో సందడి నెలకొనగా, ర్యాలీ, ధర్నా కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

పేసా, ఐదో షెడ్యూల్ హక్కులను గౌరవించాలి
ఈ సందర్భంగా తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ, ఐదో షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీల హక్కులు, ఆచారాలు, సంస్కృతికి రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామసభల పాత్రను గుర్తించిన పేసా చట్టం–1996, భూముల బదలాయింపును నియంత్రించే ఎల్‌టీఆర్‌ 1/70 చట్టం తదితర నిబంధనలను గౌరవించాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి పనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం–2006లోని సెక్షన్‌ 3(2) ప్రకారం అర్హమైన మౌలిక వసతుల పనులకు నిర్దేశించిన చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని నాయకులు పేర్కొన్నారు. రహదారులు, తాగునీటి సదుపాయాలు, పాఠశాలలు, ఇళ్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను నిబంధనల పేరుతో నిలిపివేయడం సరికాదన్నారు. గ్రామాల్లో నిలిచిపోయిన సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆటంకాలు తొలగించి, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు సహకరించాలని కోరారు.

ఆదివాసీల భూముల నుంచి తొలగించొద్దు
అటవీ హక్కుల గుర్తింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు చట్టంలో పేర్కొన్న రక్షణలను పాటించాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివాసీల భూములను స్వాధీనం చేసుకోవడం, పంటలను ధ్వంసం చేయడం, అక్రమంగా వేధించడం వంటి చర్యలకు పాల్పడితే సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యల కోసం పోరాడుతామని హెచ్చరించారు. తునికాకు, ఇప్పపువ్వు, తేనె, వెదురు వంటి అటవీ ఉత్పత్తుల సేకరణ, వినియోగం, రవాణా విషయంలోనూ చట్టబద్ధమైన హక్కులను కాపాడాలని కోరారు. అటవీ శాఖ తన వైఖరిని మార్చుకుని ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి పనులకు సహకరించాలని నాయకులు స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఏజెన్సీ వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేసి కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఫారెస్ట్ రేంజ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ జిల్లా ముఖ్య సలహాదారు డాక్టర్ కనక ప్రభాకర్, విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు మడవి మధురాజ్, ఉపాధ్యక్షుడు ఆత్రం అర్జున్, తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు మడపచి భీంరావ్, జైనూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భగవంత్ రావ్, లింగాపూర్ మండల అధ్యక్షుడు పెందుర్ ప్రకాష్, విద్యార్థి సంఘం మండల అధ్యక్షుడు జంగు, సిర్పూర్ (యు) మండల అధ్యక్షుడు కొమురం భీంరావు, వాంకిడి మండల అధ్యక్షుడు పంద్రం సురేష్‌తో పాటు ఆయా మండలాల సర్పంచులు, పటేల్‌లు, గ్రామ పెద్దలు, మహిళలు, ఆదివాసీలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి