Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

దొంగతనం, గంజాయి విక్రయాల ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్

Author
Posted By Praja Nestham Jwala News
| 28 Nov 2026, 02:53 PM |
దొంగతనం, గంజాయి విక్రయాల ముఠా గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్

రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు స్వాధీనం, 6.2 కిలోల గంజాయి పట్టివేత

సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయం, నవంబర్ 28 (ప్రజానేస్తం జ్వాల): కోదాడ పట్టణంలో ఇంటి తాళాలు పగలగొట్టి బంగారు, వెండి ఆభరణాలు దొంగిలించిన ఘటనతో పాటు గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును కోదాడ పట్టణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.15 లక్షల విలువైన 9.150 తులాల బంగారు ఆభరణాలు, 12.3 తులాల వెండి ఆభరణాలు, రూ.16 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌తో పాటు మొత్తం 6.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వ్యసనాల కోసం దొంగతనాలు.. గంజాయి విక్రయాలు
కోదాడ పట్టణానికి చెందిన షేక్ మస్తాన్, సొంటి సందీప్ అలియాస్ నటరాజ్, ఆలేటి గోపి స్నేహితులుగా ఉంటూ మద్యం, గంజాయి వంటి వ్యసనాలకు అలవాటు పడ్డారు. వ్యక్తిగత ఖర్చుల కోసం సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇళ్లలో దొంగతనాలకు పాల్పడటంతో పాటు, ఆ డబ్బుతో భద్రాచలం ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి కోదాడ, పరిసర ప్రాంతాల్లో విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గత అక్టోబర్ 20న దసరా పండుగ రోజున రాత్రి బంజారా కాలనీలోని ఓ ఇంటి ప్రహరీ గోడ దూకి లోపలికి ప్రవేశించారు. ఇనుప రాడ్‌తో ఇంటి తాళం పగలగొట్టి బీరువాను ధ్వంసం చేసి బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించారు. ఈ ఘటనపై కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

దొంగిలించిన బంగారు హారాల్లో రెండింటిని ఖమ్మంలోని గౌతమ్ బుద్ధ ఏ టు జెడ్, సాయి సద్గురు జువెలరీ దుకాణాల్లో విక్రయించి వరుసగా రూ.3.60 లక్షలు, రూ.2.65 లక్షలు పొందినట్లు పోలీసులు తెలిపారు. ఈ విక్రయాలకు సహకరించిన బచ్చలకూరి పవన్‌కు రూ.40 వేల కమీషన్ ఇచ్చినట్లు వెల్లడించారు. మిగిలిన డబ్బును మద్యం, జూదం, బెట్టింగ్‌లు, గోవా పర్యటనలు తదితర ఖర్చులకు వినియోగించినట్లు విచారణలో తేలింది.

ఇవి కూడా చదవండి

భద్రాచలం నుంచి గంజాయి కొనుగోలు
ఆభరణాల విక్రయం ద్వారా వచ్చిన డబ్బులో కొంత మొత్తంతో సందీప్, మస్తాన్ కలిసి భద్రాచలం ప్రాంతానికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తి వద్ద నుంచి సుమారు 8 కిలోల గంజాయిని రూ.40 వేలకు కొనుగోలు చేశారు. చెరో నాలుగు కిలోల చొప్పున తీసుకొని విక్రయించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నవంబర్ 19న బాలాజీనగర్ శివారులోని ఈనాడు పుల్లయ్య వెంచర్ వద్ద సుమారు నాలుగు కిలోల గంజాయితో ఉన్న షేక్ మస్తాన్‌ను పోలీసులు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మస్తాన్ అరెస్టు విషయం తెలుసుకున్న సందీప్ హైదరాబాద్‌కు వెళ్లి తన మొబైల్ ఫోన్‌ను గుర్తుతెలియని వ్యక్తికి విక్రయించాడు. తన వద్ద ఉన్న గంజాయిలో కొంత విక్రయించి, మరికొంత వినియోగించుకున్నాడు. మిగిలిన 2.2 కిలోల గంజాయిని కోదాడకు తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయించేందుకు సిద్ధమయ్యాడు.

పక్కా నిఘాతో పట్టుకున్న పోలీసులు
పోలీసుల నిఘాలో భాగంగా నవంబర్ 27న సాయంత్రం కోదాడ పట్టణంలోని శ్రీరంగాపురం డేగ బాబు ఫంక్షన్ హాల్ సమీపంలోని చెట్ల వద్ద గంజాయితో ఉన్న సొంటి సందీప్, ఆలేటి గోపిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2.2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సందీప్ ఇచ్చిన సమాచారం మేరకు దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలతో పాటు ఖమ్మంలోని నగల దుకాణాల్లో విక్రయించిన ఆభరణాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

స్వాధీనం చేసుకున్న సొత్తు:
* గంజాయి – 6.2 కిలోలు
* బంగారు ఆభరణాలు – 9.150 తులాలు
* వెండి ఆభరణాలు – 12.3 తులాలు
* నగదు – రూ.16,000
* ఒక మొబైల్ ఫోన్

ఈ కేసులో షేక్ మస్తాన్‌ను నవంబర్ 19న అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. మిగిలిన ఇద్దరు నిందితులను కూడా న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసు సిబ్బందికి ఎస్పీ అభినందనలు
ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన కోదాడ పట్టణ సీఐ కె. శివశంకర్, ఎస్‌ఐలు అజయ్ కుమార్, ఉపేందర్ రెడ్డి, కానిస్టేబుళ్లు రాంబాబు, వెంకటేశ్వర్లు, లోకేష్, నవీన్, సందీప్ రెడ్డి, ఇన్నారెడ్డి, శ్రీనివాస రెడ్డిలను జిల్లా ఎస్పీ నరసింహ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, సీఐ శివశంకర్, ఎస్‌ఐ అజయ్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.