Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఏడాదిలో 26 కేసులు.. 44 మంది నేరస్తులకు జైలు శిక్షలు

Author
Posted By Praja Nestham Jwala News
| 28 Nov 2026, 03:55 PM |
ఏడాదిలో 26 కేసులు.. 44 మంది నేరస్తులకు జైలు శిక్షలు

హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష.. 11 మందికి జీవిత ఖైదు

సూర్యాపేట, నవంబర్ 28 (ప్రజానేస్తం జ్వాల): నేరస్తులకు చట్టప్రకారం శిక్షలు పడేలా పటిష్ట దర్యాప్తు చేపట్టాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ పోలీసు అధికారులకు సూచించారు. నేరస్తులకు శిక్షలు పడటం ద్వారా వారి ప్రవర్తనలో మార్పు రావడంతో పాటు నేరాల నియంత్రణ సాధ్యమవుతుందని తెలిపారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో కోర్టు విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, నేరస్తులకు శిక్షల అమలు తదితర అంశాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, కోర్టు డ్యూటీ సిబ్బంది, కోర్టు లైజన్ అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నేరాలు తగ్గి ప్రజలు భయభ్రాంతులు లేకుండా స్వేచ్ఛగా జీవించాలంటే నేరస్తులకు శిక్షలు పడేలా పటిష్ట దర్యాప్తు అవసరమని అన్నారు. పోలీసు అధికారులు న్యాయస్థానాలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సూచించారు. ప్రతి కేసులో నిందితుడికి నేరంతో సంబంధాన్ని నిరూపించే బలమైన సాక్ష్యాధారాలు సేకరించాలని, సంఘటనా స్థలంలో లభించే ఆధారాలను శాస్త్రీయ పద్ధతుల్లో సేకరించి కేసు రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

26 కేసుల్లో 44 మందికి శిక్షలు
గత ఏడాది కాలంలో జిల్లాలో 26 కేసుల్లో 44 మంది నేరస్తులకు వివిధ రకాల జైలు శిక్షలు అమలైనట్లు పోలీసు శాఖ వెల్లడించింది. మోతే మండలంలో మూఢనమ్మకాల కారణంగా కన్నకూతురిని హత్య చేసిన కేసులో తల్లికి ఉరిశిక్ష విధించినట్లు తెలిపింది. హత్య కేసుల్లో 11 మందికి జీవిత ఖైదు, బాలలపై అత్యాచార కేసుల్లో ఇద్దరికి 30 ఏళ్లకు పైగా జైలు శిక్షలు విధించినట్లు పేర్కొంది. ఏడేళ్లకు పైగా శిక్షలు పడిన కేసుల్లో నలుగురికి, ఏడేళ్లలోపు శిక్షలు పడిన 18 కేసుల్లో 26 మందికి శిక్షలు అమలైనట్లు వివరించింది.

పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు సన్మానం
నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతంగా వాదనలు వినిపించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రఘురామయ్య, లింగయ్య, సవీందర్, కళ్యాణితో పాటు పటిష్ట ఆధారాలతో చార్జిషీట్లు దాఖలు చేసిన సీఐలు శివశంకర్, సత్యంలను ఎస్పీ సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. కోర్టు విధులను సమర్థవంతంగా నిర్వహించిన హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కానిస్టేబుళ్లు నాగబ్రహ్మం, యాసిన్, శివరాం, సైదులు, శోభన్‌బాబు, యాదగిరి, శ్రీనివాస్‌లను కూడా అభినందించారు.

ఈ సమావేశంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీనివాస్ రెడ్డి, ట్రైనీ డీఎస్పీలు, స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్‌బీ, సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్లు, ఇతర పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.